Pages

Saturday, June 29, 2013

నెలాఖరుకల్లా డీఎస్సీ నోటిఫికేషన్ - 20,000 టీచర్ పోస్టుల భర్తీ!

Tags: DSC 2013 Notification News

రాష్ట్రంలో 20 వేల టీచర్ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరుకల్లా నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. అలాగే ఈ ఏడాది వివిధ విభాగాల్లో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ సిటీ, రూరల్, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఆదివారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడలోని ఏపీ గురుకుల పాఠశాల ఆవరణ, రామచంద్రపురంలోని వీఎస్‌ఎం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. గత రెండేళ్లలో వివిధ శాఖల్లో 1.23 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. విద్యా పక్షోత్సవాల సందర్భంగా రాష్ర్టంలో రూ. 5,500 కోట్లతో పలు పాఠశాల భవనాలకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

యువత నైపుణ్యాలు పెంచుకునేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 70 మందికి శిక్షణ ఇస్తే 17 మందికి ఐఐటీలోనూ, మిగిలినవారికి ఎన్‌ఐటీలోనూ సీట్లు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, బంగారుతల్లి పథకాలు ప్రజల జీవితాలను మారుస్తాయని, ఇలాంటి పథకాలను ఏ ముఖ్యమంత్రీ ప్రవేశపెట్టలేదని చెప్పారు. సక్రమంగా రుణాలు చెల్లించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో వడ్డీ మాఫీ సొమ్ము జమ చేస్తున్నామని, మహిళలకు రూ.15 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని రామచంద్రపురం సభలో సీఎం చెప్పగానే... రైతులు, మహిళల నుంచి నిరసన వ్యక్తమైంది. అవేవీ సక్రమంగా అమలుకావట్లేదంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ తప్ప మిగిలినవన్నీ కుటుంబ పార్టీలని సీఎం వ్యాఖ్యానించారు. టీడీపీలో చంద్రబాబు తప్ప నాయకుడెవ్వరూ ఉండరన్నారు. జగన్ జైలులో ఉన్నా బయట ఉన్నా తానే నాయకుడనుకుంటారని సీఎం చేసిన వ్యాఖ్యలకు జనం నుంచి స్పందన రాలేదు. దీంతో సీఎం టాపిక్ మార్చి ప్రసంగం కొనసాగించారు.

అంతకుముందు కాకినాడ రూరల్ మండలం పి.వెంకటాపురంలో ఎస్సీ సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన ప్రారంభించారు. అక్కడి బాలలతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. కాకినాడ ఆనంద నిలయం హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి సీఎం భోజనం చేశారు. కేంద్ర మంత్రి పళ్లంరాజు, రాష్ర్ట మంత్రులు పార్థసారథి, పితాని సత్యనారాయణ, ఎన్.రఘువీరారెడ్డి, విశ్వరూప్, తోట నరసింహం, పసుపులేటి బాలరాజులతో పాటు ఎంపీ జి.వి.హర్షకుమార్, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. పర్యటన అనంతరం ముఖ్యమంత్రి సాయంత్రం 5.30 గంటలకు హెలికాప్టర్‌లో విశాఖకు వెళ్లారు.

No comments:

Post a Comment